అన్నమొ రామచంద్ర!" యని యందరు చచ్చిన రామరాజ్యమే.(27 వ తారీఖు పూరణ)

Standard

 

చెన్నుగ వచ్చు నాయకులు చేతులు కట్టుకు నోట్లకోసమై

మిన్నును దెచ్చి యిత్తుమను మేలగు నాశలు చాల జూపుచున్

తిన్నగ గద్దెనెక్కగనె తీయని మాటలు నీటిమూటలై

యన్నమొ రామచంద్ర! యని యందరు చచ్చిన రామరాజ్యమే!!!

 

పద్యరచన

 

శుండియు శ్రీకాళమ్ములు

నిండుగ సద్భక్తి తోడ నిను సేవించన్

మెండగు ముక్తినొసంగిన

చండీశుడ వందనములు చల్లగ గనుమా !!!

Advertisements

భీముండు ప్రసిద్ధుఁడయ్యెఁ బిఱికితనమునన్.(26 వ తారీఖు పూరణ)

Standard

 

సేమమగు గదా విద్యన్

భీముండు ప్రసిద్ధుఁడయ్యె , బిఱికితనమునన్

నీమము విడి యుత్తరుడా

భీమరమును వీడి తాను భీరుకుడయ్యెన్!!!

 

పద్యరచన

 

 

 

వింతగ మదిలో మెదిలెడి

మంతనముల నేరి కూర్చి మగనికి దెలుపన్

సంతసముగ నొక లేఖ శ

కుంతల లిఖియించు చుండె కూరిమి తోడన్!!!

మీసమ్ములు లేని వనిత మేదినిఁ గలదే.(పూరణ 25 వ తారీఖు)

Standard

 

మా సము లెవరని బలికెను

మీసమ్ములు లేని వనిత , మేదిని గలదే !

మీసము బెంచిన తొయ్యలి

భాసిలు వాల్జడ యె బెంచు భామకు చెలువున్!!!

పద్యరచన

 

 

మన్నును తిన లేదమ్మా

యన్నయె కల్లలను జెప్పె యనుచున్ నోటన్

నన్నియు జూపించిన యా

వెన్నుని గని తల్లి మనసు విస్మయ మందెన్!!!

పదునాలుగు లోకమ్ములు

విదితంబుగ నోట జూపు వెన్నుని గనుచున్

ముదముగ యశోద మ్రొక్కుచు

కదలిక గోల్పోయి దలచె కలయా! నిజమా !!!

జలుబు – దగ్గు – నొప్పి–నలత(దత్తపది–24 వ తారీఖు)

Standard

 

 

ప్రజలు బుద్ధిమాలి ప్రల్లదమాడగా

ధరణిసుతకు గరిమ దగ్గు నయ్య?

నొప్పిదముగ నీవు కప్పురగంధిని

కానలతరలింప మాను రామ !!!

 

ప్రజలు బుధులు వచ్చి ప్రార్ధింప గాదని

దగ్గుమొగ్గు లేక తమ్ముడికను

నొప్పిదముగ ధరను నోముకొనుననుచు

కానల తరలెనుగ కపిరథుండు!!!

పద్యరచన

రారా ముకుంద! మాధవ!

రారా కృష్ణా! మనోభి రామా !యనుచున్

మీరా గానము జేయుచు

ద్వారక నాధుడిని జేరి తరియించెనుగా !!!

దనుజుల యిలవేల్పు చక్రధరుఁడగు హరియౌ.(23 వ తేదీ పూరణ)

Standard

 

కనియగ నఖిలమ్మునకున్

మనికిని గల్గించు నతడె మాధవుడనుచున్

మనుపును గోరుచు వేడెడి

దనుజుల యిల వేల్పు చక్రధరుడగు హరియౌ!!!

 

పద్యరచన

 

వండి పెట్టెడి వేళ వంటింటి మహరాణి

. ….యన్నపూర్ణయె తాను హంసయాన

విద్యలందు నపుడు విజ్ఞాన ఖనియామె

. ……..పలుకుతొయ్యలి గాదె తలిరుబోడి

యిలను గెలిచి జూపు నే వృత్తి నందైన

. ….విజయలక్ష్మి యగును వెలది తాను

సంతసమ్ముగ తాను సంతానలక్ష్మియౌ

. …….కన్న సుతుల గాచు కలువకంటి

 

సవ్యసాచి వోలె సంధాన కర్తయౌ

నొక్క వనిత జేయు పెక్కు పనులు

నారు రూపులందు నలరారు రుచిరాంగి

యాదిశక్తి గాదె యవని యందు!!!

పండితుఁ డెందులకు పనికివచ్చు ధరిత్రిన్. (22 వ తేదీ పూరణ)

Standard

 

పండితభావము దెలియని

పండితు డెందులకు, పనికివచ్చు ధరిత్రిన్

పెండెరములు లేకున్నను

నిండుగ జనహితము గోరు నిజమగు పఠియే!!!

 

పద్యరచన

 

తెలుపు నలుపు కలగలిసిన తేనె కళ్ళ పిల్లిరా

తలుపు వెనక మాటు వేసి తపన తోడ నుండెరా

యెలుక కొరకు వేచి యుండె నింత లేసి కళ్ళతో

పలుక రించ పారి పోవు ప్రాణ మన్న తీపిరా !!!

 

పిల్లి పిల్ల పారికోయె వెదకు చున్న దొరకదే

లల్లి బెంచె ప్రేమ మీర రస్కు లేసి దానికిన్

చిల్లి గారె లివ్వ గానె చిందు లేసి యాడునే

కళ్ళ బడితె మీకు తాను కాస్త నాకు జెప్పరే !!!

రాజా! పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై..

Standard

 

రోజా లున్నవి ముళ్ళు లేక సభలోరూపించె మిథ్యాగతిన్

జాజుల్మల్లెలు జంటగా నచట సంజాతంబు గానుండె నా

యాజాబిల్లిని జూచి కల్వలుగదా యాహ్లాద మున్ విచ్చు నో

రాజా !పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై!!!

 

పద్యరచన

 

ప్రతి దినమున వేకువనే

నతులిడి బూజించవలయు నయముగ తులసిన్

వ్రతముగ గొలువగ నిటులన్

నతులిత బుణ్యంబు గలుగు నతివల కిలలో!!!

సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్….

Standard

మతి నీయమనుచు సుతునికి

వెతలను కలిగించకెపుడు వేడుక లీయన్

గతియే నీవని దేవకి

సుతుపదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్!!!

 

పద్యరచన

 

 

దుష్టుల నణచగ దేవకి

యష్టమ గర్భముగ బుట్టి హరిమేధుండే

సృష్టిని గావగ చెరవిడి

యిష్టముగ యశోద యొడిన యిమ్ముగ బెరిగెన్!!!

 

పుట్టిన బిడ్డను జూచుచు

నెట్టులొ మది దిట్టబరచి నిశిలో పతితో

బిట్టుగ పంపెను దేవకి

గుట్టుగ చెరసాలనుండి గోపాలుడినే!!!

కోడి ని కరకర నమిలె కోడలమ్మ(19 వ తారీఖు నాటి పూరణ, పద్యరచన)

Standard

 

ఆడి కారును దెచ్చిన కోడలనుచు

పెత్తనమ్మునుజేయక యత్తగారు

కమ్మ కమ్మగ నీయగ కాజు తోప

కోడి ,ని కరకర నమిలె కోడలమ్మ!!!

 

పద్యరచన

 

శ్వాస నీయంగ రేపటి యాశలకును

భూమి చీల్చుకు వచ్చెను బుజ్జి మొలక!

రక్కసుల నోట చిక్కక రమ్యముగను

జీవ మందిచుమా నీవు చిట్టి తల్లి!!!

పద్యరచన (18 వ తారీఖు )

Standard

పద్యరచన

 

కుంభ కర్ణుని మేల్కొల్ప కొలువు గాళ్ళు

పలు తెరంగుల యత్నించి భంగ పడిరి

తుదకు భోజనమును దెచ్చి మదిర జల్ల

బండ నిద్రను వదిలెనా గండరీడు !!!